గ్రావెల్ లీజు రద్దు చేయాలని వెంకటాపురంవాసుల ధర్నా
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వెంకటాపురం గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై మంజూరు చేసిన గ్రావెల్ క్వారీ లీజులు రద్దు చేయాలంటూ స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. సర్వే నంబర్ 156/పీ లోని 12.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీలక్ష్మీ నరసింహ మినరల్స్‌కు లీజు మంజూరు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని కాలుష్య సమస్య పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ధార ఈ ప్రాంతం గుండా వెళ్తుందని వారు తెలిపారు. అంతేకాకుండా యాదవ కులస్థులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలోని కొండల వద్ద పశువులను మేపుతామని, ఇప్పుడు గ్రావెల్ తవ్వకాలు జరిపితే తమ పశువులకు రక్షణ, మేత ఉండదని వారు వివరించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.


