ఇంటి పన్ను వసూళ్ల పక్కదారిపై విచారణ
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో పక్కదారి పట్టిన ఇంటి పన్నుల వసూళ్ల నగదు వ్యవహారంపై నర్సీపట్నం డీఎల్‌పీవో ఎస్.సత్య సూర్యనారాయణ మూర్తి మంగళవారం విచారణ జరిపారు. ఏటికొప్పాక పంచాయతీలో సుమారు రూ.4.23 లక్షలకు పైగా ప్రజల నుంచి వసూలైన పన్నుల సొమ్మును బిల్ కలెక్టర్ రమణబాబు సొంత అవసరాలకు వాడుకున్నట్టు తెలిసిందే. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడం, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో డీఎల్‌పీవో మూర్తి మంగళవారం యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ కలెక్టర్ వి. రమణబాబును ప్రశ్నించారు. పంచాయతీ ఖతాలో జమ చేయాల్సిన సొమ్ము సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కాలంలో పన్నుల వసూళ్లకు సంబంధించిన బిల్లు, లెడ్జర్, రశీదు పుస్తకాలను ఆయన తనిఖీ చేశారు. ఏటికొప్పాక పంచాయతీలో నిధులు పక్కదారి పట్టినా పంచాయతీ కార్యదర్శి ఎందుకు నిర్లక్ష్యం చూపారని ఆరా తీశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బిల్ కలెక్టర్ రమణబాబు చోడవరం పంచాయతీ పరిధిలో పని చేసినపుడు కూడా నిధుల పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నట్టు డీఎల్‌పీవో తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. లైనుకొత్తూరు, జంపపాలెం పంచాయతీ కార్యదర్శులు ఆయన వెంట ఉన్నారు.
పన్నుల వసూళ్లు 24.33 శాతమే
నర్సీపట్నం డివిజన్‌లో 364 గ్రామపంచాయతీలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16.98 కోట్లు పన్నుల రూపంలో వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 24.33 శాతం అంటే రూ.4.94 కోట్లు మాత్రమే వసూలైనట్టు డీఎల్‌పీవో మూర్తి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా రూ.12.4 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఇంటి పన్ను మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల పంచాయతీల్లో పన్ను వసూళ్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొత్తగా అమలులోకి వచ్చిన ఈ పద్ధతిని ప్రజలంతా సద్వినియోగపర్చుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం విద్యార్థి


