ప్రతిభ గల దివ్యాంగులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ
అనకాపల్లి : దివ్యాంగ బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో జోనల్ స్థాయి దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష సహిత విద్యా ఆధ్వర్యంలో క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగ బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా విభాగం ప్రతినిధి శంకరయ్య మాట్లాడుతూ, శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా ఎంపికై న దివ్యాంగ బాలలకు వచ్చే ఏడాది జనవరి మాసంలో నెల రోజుల పాటు కడపజిల్లా గండికోటలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జోనల్ స్థాయిలో ప్రతిభ సాధించి క్రీడాకారులకు కడపలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కడపలో శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు మార్చి, ఏప్రిల్ మాసంలో లడఖ్‌లో మరింత కఠినమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు, అక్కడ శిక్షణ పూర్తి అయిన తరువాత బాలలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ క్రీడల్లో అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, విశాఖ జిల్లాల దివ్యాంగుల బాలబాలికలకు పోటీలు నిర్వహించడం జరిగిందని, జిల్లా సహిత విద్య సమన్వయకర్త డి.రామకృష్ణనాయుడు చెప్పారు. ఈ పోటీల్లో 182 మంది క్రీడాకారులు పాల్గొనగా జోన్ నుంచి 10 మంది దివ్యాంగ బాలబాలికలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు నీరజ, భాస్కర్, పి.గిరి ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్
డాక్టర్ నరసింహం
ప్రతిభ గల దివ్యాంగులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ


