ఆదర్శ రైతు అరుణకు పుడమి పుత్ర అవార్డు
కశింకోట: మండలంలోని సుందరయ్యపేట గ్రామానికి చెందిన మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వాహకురాలు, ఆదర్శ రైతు కూండ్రపు అరుణకు పుడమి పుత్ర 2024 పురస్కారం లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేంద్రరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశంసా పత్రం, జ్ఞాపికను పురస్కారంగా అందించి సత్కరించారు. అరుణను ఆదర్శంగా తీసుకొని యువ రైతులు ప్రకృతి సేద్యాన్ని చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించి ఆరోగ్య సమాజంగా రూపుదిద్దుకోవడానికి దోహదపడాలని వారు ఆకాంక్షించారు. తనకు ఈ పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


