పోస్టల్ నిధుల గోల్‌మాల్‌పై విచారణ
నర్సీపట్నం : నాతవరం మండలం, మన్యపురట్లలో తపాలాశాఖలో జరిగిన నిధుల స్వాహాపై మంగళవారం గ్రామంలో విచారణ జరిగింది. ఇక్కడ పోస్టుమాస్టర్‌గా పని చేసిన రావాడ సోమరాజు పలు ఖాతాల నుంచి దాదాపు రూ.7లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా మేలుకున్న తపాలాశాఖ అధికారులు సోమరాజును ఇది వరకే సస్పెండ్ చేశారు. ఇక్కడ నిధులు గోల్‌మాల్‌కు సంబంధించి సాక్షి ఈ నెల 17వ తేదీన పోస్టల్ బ్రాంచ్‌లో రూ.7లక్షలు గోల్‌మాల్ శీర్షికన వార్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కదలిన తపాలా శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తపాలాశాఖ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ రమేష్‌లు బ్రాంచిని తనిఖీ చేశారు. నాలుగు గ్రామాలకు సంబంధించి 321 ఖాతాదారుల నుంచి నిధులు స్వాహా జరిగినట్టు తెలిసింది. అయితే విచారణ విషయం తెలియక పలువురు ఖాతాదారులు హాజరు కాలేకపోయారు. స్వాహా సొమ్ముపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సూపరిండెంటెంట్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. స్వాహా సొమ్ము రికవరీకి అన్ని చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులకు నష్టం జరగకుండా సూచించారు.


