ఎన్టీపీసీ నుంచి రూ.1.21 కోట్ల సీఎస్సార్ నిధులు
● ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగం
తుమ్మపాల: ప్రజల వైద్యసేవల కోసం మెరుగైన సౌకర్యాల ఏర్పాటుతోపాటు పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఎన్టీపీసీ సీఎస్సార్ నిధులను అందించిందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె చాంబర్‌లో ఎన్టీపీసీ సింహాద్రి తన సీఎస్సార్–సీడీ కింద మంజూరు చేసిన రూ.కోటి 21 లక్షల 50 వేలు, రూ.50 లక్షల చెక్కులను వేర్వేరుగా కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్, 6 పీహెచ్‌సీలు, 3 యూపీహెచ్‌సీల అభివృద్ధికి, క్రిటికల్ కేర్ యూనిట్‌కు రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించినట్టు చెప్పారు. ఇప్పటికే రూ.72.50 లక్షల మొదటి విడత మొత్తాన్ని విడుదల చేశారని చెప్పారు. పోలీస్ శాఖకు మద్దతుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ రూ.50 లక్షలను మంజూరు చేసిందని, నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇప్పటికే మొదటి విడత రూ.25 లక్షలు విడుదల చేసిందన్నారు.


