అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
తుమ్మపాల : సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గూర్చి వాటి కారణాలు వివరంగా తెలియజేయాలన్నారు. అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 344 అర్జీలు నమోదు జరిగాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్ జిల్లా సమన్వయ అధికారి ఎస్.సుబ్బలక్ష్మి, సిపిఓ జి.రామారావు, మెప్మా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, గృహనిర్మాణ పథకం సంచాలకులు కె.సరోజినీ, శచిదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, డీఈవో జి.అప్పారావు నాయుడు, జిల్లా ఎక్సయిజ్ అధికారి వి.సుధీర్ పాల్గొన్నారు
ప్రత్యేక పంచాయతీకి వినతి
ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కశింకోట మండలం జి.భీమవరం గ్రామపరిధిలో గల సింగవరం గ్రామస్తులు కలెక్టర్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో విన్నవించారు. తక్కువ జనాభా రిత్యా కొన్నేళ్ల క్రితం సింగవరం గ్రామాన్ని జి.భీమవరం గ్రామ పంచాయతీలో విలీనం చేయడంతో గ్రామాభివృద్ధి వెనకబడిందని తెలిపారు. ఇంటిపన్నులు, ఇతరాత్ర రూపాల్లో పంచాయతీకి వస్తున్న ఆదాయాన్ని జి.భీమవరం గ్రామానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారని వాపోయారు. తమ గ్రామంలో 650 మంది ఓటర్లు, 1,250 మంది జనాభా ఉన్నారని, ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందని తెలిపారు.
ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించి కలెక్టరేట్ గేటు వద్ద నిరసన తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కోసం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చేయాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ బొంతు రమణ అన్నారు. ఓబీసీ నాయకులు పొలమర శెట్టి ఆదిమూర్తి, బుద్ధ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి కేంద్రంగా
రెవెన్యూ డివిజన్ కావాలి...
యలమంచిలి కేంద్రంగా నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు, ఫెన్షనర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ ప్రజలకు దూరాభారంగా ఉంటుందని, అన్ని వసతులతో యలమంచిలి పట్టణం ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మలకొండ బాబు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడారిపూరి జగన్నాథం, యలమంచిలి బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నక్కా శివశంకర్, ఎల్లపు రాజు కలెక్టర్‌ను కోరారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
ఉపాధి పథకం పేరు మార్పుపై నిరసన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు
కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్
మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్‌లకు సంబంధించి విడుదల చేసిన జీవో 1491ను సవరించాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండలంలోని సర్పంచ్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 తేదీన అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఉన్న యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న నక్కపల్లి డివిజన్‌లో కలుపుతూ జీవో విడుదల చేసిందన్నారు. నక్కపల్లి డివిజన్‌ను తామంతా స్వాగతిస్తున్నామని అయితే సుదూర ప్రాంతంలో ఉండే నక్కపల్లి డివిజన్‌లో మాత్రం యలమంచిలి నియోజకవర్గాన్ని మినహాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను సవరించేలా చర్యలు తీసుకొని యథావిధిగా అనకాపల్లి డివిజన్‌లో ఉండేలా చూడాలన్నారు.
ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మాణం అమలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,సర్పంచ్‌లు సుందరపు తాతాజీ, చదరం నాయుడు,భీశెట్టి గంగప్పలనాయుడు,బొడ్డేడ శ్రీనివాసరావు,ఇందల నాయుడు,జాజుల వెంకటరమణ,పార్టీ నాయకులు కాండ్రేగుల జగన్, పిన్నమరాజు రవీంద్రరాజు, శ్రీపతి రామకృష్ణ పాల్గొన్నారు.
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు


