కొత్త పింఛన్లు తక్షణం మంజూరు చేయండి
నక్కపల్లి: చంద్రాబాబు ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సి వీసం రామకృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పింఛన్ల కోసం 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీ లందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని బూటకకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 50 ఏళ్లు కాదు కదా 70 ఏళ్లు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదని అన్నారు. పింఛన్ల కోసం పండుటాకులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారన్నారు. వృద్ధాప్య పింఛన్లే కాకుండా వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు సైతం మంజూరు చేయలేదని తెలిపారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు మాసాలకొకసారి వలంటీర్ల ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేశామని, నక్కపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 6వేలకు పైగా కొత్తపింఛన్లు మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు.


