కేంద్ర వర్శిటీల్లో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మునగపాక : కేంద్ర విశ్వ విద్యాలయాల పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కర్నాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్, ప్రొఫెసర్ దొడ్డి వెంకట రమణ కోరారు. సోమవారం ఆయన మునగపాక పీఏసీఎస్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి జనవరి 14లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష మార్చిలో ఉంటుందన్నారు. డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం తమ యూనివర్సిటీలో ఉన్న 30 పీజీ కోర్సులకు అదనంగా మరో 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ విశ్వ విద్యాలయంలో చదువుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే పలు ఉపకార వేతనాలను పొందగలరని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


