తాళ్లపాలెం సంతకు పండగొచ్చింది...
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం వారపు సంతలో సోమవారం గొర్రెలు, మేకల అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్వ విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాల నుంచి పెంపకందారులు, వ్యాపారులు గొర్రెలు, మేకలు అమ్మకానికి తీసుకు వచ్చారు. సుమారు వెయ్యి వరకు వచ్చాయి. వీటిని విశాఖ, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పెంపకందారులు, హోటల్ యజమానులు వచ్చి కొనుగోలు చేసి వ్యాన్లు, ఆటోల్లో తీసుకు వెళ్లారు. పరిమాణం అనుసరించి రూ. ఐదారు వేల నుంచి రూ.30 వేల వరకు ఒక్కొక్కటి అమ్మకాలు సాగాయి. అలాగే గొర్రెలు, మేకల మందలను కూడా అమ్మకానికి తీసుకు రాగా, వాటి సంఖ్యను అనుసరించి రూ.నాలుగైదు లక్షలకు విక్రయించారు. అయితే ప్రస్తుతం సీజన్ కావడంతో ఎక్కువగా పిల్ల మేక, గొర్రెలతో అమ్మకానికి వచ్చాయి. సంక్రాంతి సమీపిస్తుండడంతో పందెం కోడి పుంజుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కటి రూ.2 వేల నుంచి రూ.పది వేల వరకు విక్రయాలు సాగాయి. కూరగాయలు కిలో పాదు చిక్కుడు రూ.100, వంకాయ రూ.80, దొండకాయ, బీట్రూట్, క్యారెట్, బీరకాయ రూ.70, టమాటా రూ.60, ఉల్లిపాయ, బంగాళాదుంప రూ.30 ధరలో విక్రయాలు జరిగాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా అదనంగా రూ.70 పెరిగింది. గత వారం రూ.50 ఉండగా, ఈ వారం రూ.120కి పెరిగింది.


