ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి
దేవరాపల్లి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేవరాపల్లిలో ఉపాధి కూలీలతో కలిసి సోమవారం ఆయన నిరసన తెలిపారు. 2025 ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. 2025 చట్టం ప్రకారం వ్యవసాయ పనుల్లేని రోజుల్లో ఏడాదిలో 100 రోజులు ఎప్పుడైనా పనులు పొందే అవకాశం ఉండేదని, నేడు ఆ హక్కు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి గతంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రం నిధులు కేటాయించేదన్నారు. ప్రస్తుత మార్పులతో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా మార్పులు చేశారన్నారు. తద్వారా రాష్ట్రంపై రూ. 2800 కోట్లు భార పడుతుందన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో బి.నాగేశ్వరరావు, శంకరరావు, మామిడి దేముడు, గణేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


