గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం
దేవరాపల్లి: రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) బి.బాలునాయక్ తెలిపారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో దేవరాపల్లి మండల రైవాడ అథితి గృహానికి చేరుకొని స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5,459 కోట్లు కేటాయించిందని, కొన్ని పనులు జరుగుతుండగా మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు కొంతమేర అడ్డంకిగా మారినప్పటికీ ఇప్పటికే 128 పనులకు అనుమతులు సాధించామన్నారు. అకాల వర్షాలతో రోడ్ల నిర్మాణ పనులలో కొంత మేర జాప్యం జరిగిన మాట వాస్తమేనని, ఇకపై వేగవంతం చేసేందుకు విశాఖలో ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో సమీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పీఆర్ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు, పాడేరు ఈఈ కొండయ్య పడాల్, అరకు డీఈఈ రామం, మాడుగుల పీఆర్ డీఈఈ ఎ.శ్రీనివాసరావు, దేవరాపల్లి పీఆర్ ఏఈ పి.సుమతి తదితర్లు ఉన్నారు.


