జూలో నల్ల హంసను దత్తత తీసుకొన్న చిన్నారి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. నగరానికి చెందిన అల్వార్‌దాస్ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న నలం జెస్వికా అనే చిన్నారి తన పుట్టినరోజును పురస్కరించుకుని జూలోని ఒక నల్ల హంసను ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి జూను సందర్శించిన జెస్వికా, వన్యప్రాణుల పట్ల తనకున్న మక్కువను చాటుకుంది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. మంగమ్మ చిన్నారి జెస్వికాను ప్రత్యేకంగా అభినందించి, దత్తత ధ్రువీకరణ పత్రంతో పాటు అడాప్షన్ కిట్‌ను అందజేశారు. ఇంత చిన్న వయసులో వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని ఆమె కొనియాడారు. జూలోని మూగజీవాల పోషణ, సంరక్షణ కోసం మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.


