చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా బోయిలకింతాడ గ్రామ ప్రధాన కూడలి నుంచి చెరకు కాటా వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాటా ఎదుట ప్లకార్డులతో చెరకు రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలకుల తీరుతో రైతులు కంట తడి పెట్టే దయనీయ పరిస్థితి నెలకొందని, రైతులు ఉసురు తప్పకుండా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద నేడు రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రూ. 90 కోట్ల మేర నిధులు ఫ్యాక్టరీకి కేటాయించి, ఐదేళ్ల పాలనలో రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని ఆదుకుంటామని ఊరు వాడా ఊదరగొట్టిన ఈ ప్రాంత ఎంపీ, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ సమస్యలపై దృష్టి సారించక పోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతానికి కొత్తగా ఫ్యాక్టరీలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఉన్న పరిశ్రమను కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో సంక్రాంతి సీజన్‌లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని, నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాధుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని అద్భుతంగా నడిపిస్తామని నమ్మబలికిన కూటమి నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందాక రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఎండీ ద్వారా చెరకు సరఫరా చేయాలని కరపత్రాలు పంపిణీ చేయించిన ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడానికి ముఖం చాటేయడం అత్యంత దారుణమన్నారు. కూటమి నేతలు కేవలం ఓట్ల కోసమే రైతులకు మోసపూరిత హామీలు గుప్పించారని, ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం అక్టోబర్‌లో నిర్వహించాల్సిన సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను ఇప్పటికీ నిర్వహించక పోవడం అన్యాయమన్నారు. ఫ్యాక్టరీ చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్, ఎండీ సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఫ్యాక్టరీని ఎందుకు నడిపించలేక పోతున్నారో, రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ధ్వజమెత్తారు. మహాజన సభను తక్షణమే నిర్వహించి రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. తక్షణమే ఫ్యాక్టరీని తెరిపించి సుమారు రూ. 35 కోట్ల మేర నిధులు విడుదల చేస్తే తప్ప ఫ్యాక్టరీ మనుగడ సాగించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు చెరకు రైతులు, కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిలబడి ఉద్యమం చేపడతామని ముత్యాలనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సీడీసీ డైరక్టర్ అన్నం రాము, వైఎస్సార్‌సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు అన్నం రామునాయుడు, పార్టీ నియోజకవర్గ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డా. వరదపురెడ్డి సింహాచలం నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు కెవి.రమణ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు గొర్రుపోటు సుధారాణి, ఉర్రూకుల అప్పారావు, సర్పంచ్‌లు చింతల సత్య వెంకటరమణ, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాడి జగన్, గూడెపు రాము, గంధం రామకృష్ణ, రెడ్డి సూర్యనారాయణ, టోకురి రామకృష్ణ, ఎంపీటీసీలు రొంగలి నారాయణమ్మ, పోతల వెంకటరావు, సీనియర్ నాయుకులు అన్నం రామునాయుడు, చల్లా నాయుడు, బండారు దేముడునాయుడు, భుగత వెంకటరమణ, రుత్తల రాంబాబు, గొర్లె రామ కొండలరావు, కాటిపాం పెదనాయుడు, దాసరి గోపి, బండారు ప్రసాద్, మజ్జి రాజు, రుత్తల రాంబాబు, వంటాకు శ్రీను, చింతు రాము, కిల్లాన వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతపడే
స్థాయికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ తెరవక అల్లాడుతున్న
కార్మికులు, రైతులు
మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు ధ్వజం
బోయిలకింతాడలో చెరకు కాటా
ఎదుట రైతుల భారీ నిరసన
చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి


