రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద ఫ్లిప్‌కార్ట్ స్టోర్ ఆఫీసు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి శనివారం మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇత్తంశెట్టి సూర్యనారాయణ(46) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొంది, కోలుకోవడంతో వారం రోజుల క్రితం ఇంటికి పంపించారు.మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సూర్యనారాయణ మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శనివారం సాయంత్రం మృతుని స్వగ్రామం పోతురెడ్డిపాలెంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.ఇదే ప్రమాదంలో గాయపడిన సూర్యనారాయణ భార్య సత్యవతి కోలుకున్నారు.


