నాడు విద్యార్థినిగా... నేడు ఉపాధ్యాయినిగా..
మునగపాక : ఎక్కడయితే పదో తరగతి వరకు చదువుకున్నారో అదే స్కూల్‌లో జరిగిన శిక్షణకు ఉపాధ్యాయురాలిగా హాజరవడం అరుదైన విషయం. అలాంటి అరుదైన సంఘటన మునగపాకలో శనివారం చోటు చేసుకుంది. మునగపాకకు చెందిన బుద్ద జగదాంబ మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1986–87లో పదో తరగతి చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులు పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా పలు ప్రాంతాల్లో పనిచేస్తూ వచ్చారు. కొంత కాలంగా మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా సేవలందిస్తున్నారు. శనివారం మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ శిక్షణకు జగదాంబ హాజరయ్యారు. నాడు పదో తరగతి వరకు చదువుకున్న పాఠశాలలోనే తాను ఉపాధ్యాయురాలిగా శిక్షణకు హాజరు కావడం సంతోషంగా ఉందని జగదాంబ తెలిపారు.


