ముగిసిన విజన్–2 శిక్షణ
సబ్బవరం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు తమ జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమం విజన్–2 శుక్రవారంతో ముగిసింది. స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయంలో నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా ప్రాజక్ట్ మేనేజర్ పి.వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయం సహయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ద్వారా సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆర్థిక, ఆర్థికేతర, సహకార సంఘాల చట్టాలపై, నాయకత్వంపై చర్చించినట్లు తెలిపారు. శిక్షణ ఆనంతరం సబ్బవరం మండలంలోని అన్ని పంచాయతీల్లో రెండు రోజుల పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో జీవన ప్రమాణాల మెరుగుదలకు సీసీల ద్వారా ఇంటర్ ఫేస్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సబ్బవరం, యలమంచిలి, గొలుగొండ, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, చోడవరం మండలాల ఏపీఎంలు, సీసీలు, సబ్బవరం మండలంలోని గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


