సీఎం అపాయింట్‌మెంట్ పది నిమిషాలే..
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● 60 మందితో మత్స్యకారుల కమిటీ.. కానీ చర్చలకు
30 మందికే అవకాశం
● ఆరుగురే మాట్లాడాలని సూచన
● ఏం చర్చించాలో ముందే కౌన్సెలింగ్ ఇచ్చిన
అధికారులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న రాజయ్యపేట మత్స్యకారులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చలు జరపనున్నారు. దాదాపు 70 రోజులపాటు గ్రామంలో రిలే నిరాహారదీక్ష చేపట్టిన మత్స్యకారులు.. సీఎం దగ్గరకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా దీక్ష విరమించిన విషయం తెలిసిందే. ఆమె సూచన మేరకు గ్రామస్తులంతా 60 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుని జాబితా అధికారులకు అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయలేదు. దీంతో మత్స్యకారులు ఈనెల 21వ తేదీలోగా తమను సీఎం వద్దకు తీసుకెళ్లకపోతే యథావిధిగా నిరాహార దీక్ష చేపడతామని అల్టిమేటం ఇచ్చారు. ఇదే విషయమై ‘వంచన వలలో విల విల’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 18న కథనం వెలువడింది. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. శనివారం తాళ్లపాలెంలో సీఎం పర్యటన ఉంది. ఈ పర్యటనలో రాజయ్యపేట మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు అఽధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఏం మాట్లాడాలో వారే చెప్పారు..
సీఎంతో చర్చల సందర్భంగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడానే విషయాలపై శుక్రవారం అధికారులు మత్స్యకారులకు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఎంతో చర్చలకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. కేవలం పది నిమిషాల్లోనే మీ డిమాండ్లు చెప్పాలని సూచించారు. చర్చల్లో పాల్గొనేందుకు 30 మందిని అనుమతిస్తున్నప్పటికీ సీఎంతో మాట్లాడేందుకు మాత్రం కేవలం ఆరుగురికే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరికి మాత్రమే సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అధికారుల ఆంక్షలపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తాము ఎదుర్కొనే ఇబ్బందులు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తెలియజేయాలని షరతు విధించడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారంనాటి సంచికలో ‘సాక్షి’ ప్రచురించిన కథనం


