29 నుంచి రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ క్రీడలు
స్పోర్ట్స్ మీట్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.రత్నకుమార్
మురళీనగర్ (విశాఖ): కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ తెలిపారు. గురువారం కళాశాలలో ఈ క్రీడల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. బాలబాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్, చెస్ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.


