పంచాయతీ విభజనపై టీడీపీలో వర్గపోరు
గొలుగొండ గ్రామం
గొలుగొండ : గొలుగొండ గ్రామ పంచాయతీ విభజన విషయంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఈ పంచాయతీ విభజనకు గొలుగొండలో మూడు రోజుల క్రితం గ్రామసభ నిర్వహించారు. ఈ పంచాయతీలో సుమారుగా 3250 ఓట్లతో పాటు గొలుగొండ, శ్రీరాంపురం, కొత్తజోగుంపేట, 80 ఎస్సీ కాలనీ, పేట మాలపల్లి గ్రామాలు ఉన్నాయి. ఇందులో గ్రామ సభ నిర్వహించిన సందర్భంలో 80 ఎస్సీ కాలనీ, పేటమాలపల్లి గ్రామాల్లో ఓటర్లు, ప్రజలు తామంతా గొలుగొండ నుంచి విడిపోయి పక్కనే ఉన్న జోగుంపేటలో విలీనం అవుతున్నట్టు చెప్పారు. శ్రీరాంపురం, కొత్త జోగుంపేట గ్రామాలు ప్రత్యేక పంచాయతీగా విడిపోవడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే గొలుగొండ పంచాయతీలో గెడ్డ అవతల, గెడ్డ ఇవతల అనే నినాదం ఉంది. గెడ్డ అవతల శ్రీరాంపురం, కొత్తజోగుంపేట, పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీ గ్రామాలు ఉన్నాయి. గెడ్డ ఇవతల కేవలం గొలుగొండ గ్రామం ఉంది. గ్రామ సభ జరిగిన సందర్భంలో పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీ జోగుంపేట వెళ్లడం కోసం ప్రయత్నాలు చేయగా జోగుంపేట పంచాయతీ నాయకులు కలవడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అప్పటికే గొలుగొండ పంచాయతీలో ఉన్న శ్రీరాంపురం, కొత్త జోగుంపేట వేరే పంచాయతీగా ఏర్పాటుకు తీర్మానాలు చేయడం జరిగింది. ఇక్కడే టీడీపీ నాయకుల నడుమ వర్గ విభేదాలు మొదలయ్యాయి. పేటమాలపల్లి, 80 ఎస్సీ కాలనీని శ్రీరాంపురం, కొత్తజోగుంపేటలో కలవడానికి అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గొలుగొండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం స్వీకర్ అయ్యన్నపాత్రుడుని కలసి ఉంటే పంచాయతీ మొత్తం కలసి ఉంటాం.. లేదంటే గెడ్డ అవతల ఉన్న శ్రీరాంపురం, కొత్త జోగుంపేట, 80 ఎస్సీ కాలనీ, పేటమాలపల్లి వేరే పంచాయతీ చేయండి అంటూ పట్టుబట్టినట్టు తెలిసింది.


