విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యుటీఎఫ్ ధర్నా
అనకాపల్లి : జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేట జాతీయ రహదారి డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ మాట్లాడుతూ 2011కి ముందు నియామకమైన టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను అమలు చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలన్నారు. గతంలో ఐచ్చిక సెలవులను పాఠశాలలకు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో అవి వ్యక్తులకు మార్చడం సరికాదన్నారు. పదో తరగతి యాక్షన్ ప్లాన్ పేరుతో సెలవు దినాల్లో పనిచేయాలనే నిబంధనను రద్దు చేయాలని, జీవీఎంసీలో అర్హులైన ఎస్‌జీటీలకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. జూన్ 2025న బదిలీ అయిన హిందీ ఉపాధ్యాయులను ఇంతవరకు రిలీవ్ చేయకపోవడం అన్యాయమన్నారు. అనంతరం డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ రామలింగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీమతి వత్సవాయి శ్రీలక్ష్మి, గౌరవాధ్యక్షుడు పంపన బోయిన వెంకట్రావు, కార్యదర్శులు గుత్తుల సూర్య ప్రకాష్, శేషు, చైతన్య శీల, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


