నిరుద్యోగులు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవాలి
అనకాపల్లి : నిరుద్యోగ యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకుని స్థిరపడేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి, ఈడీ సత్యపద్మ అన్నారు. స్థానిక ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) జిల్లా కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం పూర్తయిన డ్రైవర్లకు శుక్రవారం ఆమె సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు నిరుద్యోగ యువతకు హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 45 రోజులు శిక్షణ ఇస్తూ ఆర్టీవో వారితో డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా అందజేయడం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రజారవాణాశాఖ జిల్లా అధికారి వి.ప్రవీణ మాట్లాడుతూ నేటి వరకూ 173 మందికి అనకాపల్లి డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 35 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ హనుమశ్రీ, ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి భాస్కరరావు, ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ డీఈవో బాపునాయుడు పాల్గొన్నారు.


