కేజీహెచ్‌లో చిన్నారికి సంక్లిష్ట వెన్నుముక శస్త్రచికిత్
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణిని కలిసిన తేజస్వని, ఇతర కుటుంబ సభ్యులు
మహారాణిపేట: కేజీహెచ్ వైద్యులు తొమ్మిదేళ్ల బాలికకు అత్యంత క్లిష్టమైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన తేజస్వని..తీవ్రమైన మెడనొప్పి, తల నిలపలేకపోవడంతో గత నెల 11న ఆస్పత్రిలో చేరింది. బాలికకు టీబీ సోకడంతో పాటు వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమ్‌జీత్ రే ఆధ్వర్యంలో కార్డియో థొరాసిక్, ఆర్థోపెడిక్ , అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో ఈ నెల 5న ఈ ఆపరేషన్ నిర్వహించారు. సకాలంలో శస్త్రచికిత్స జరగడం వల్ల బాలిక కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం ఆమె క్షేమంగా నడుస్తోందని వైద్యులు వెల్లడించారు. సుమారు నాలుగు లక్షల రూపాయల ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించారు. శస్త్ర చికిత్స విజయవంతంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి హర్షం వ్యక్తం చేస్తూ వైద్య బృందాన్ని అభినందించగా.. బాలిక తల్లిదండ్రులు వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


