
యువత క్రీడలపై మొగ్గు చూపేలా ప్రోత్సాహం
తుమ్మపాల: క్రీడలను ప్రోత్సహించి, చురుకై న క్రీడాకారులను తయారు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, యువత వ్యసనాలకు బానిసకాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా క్రీడా మైదానాలు సిద్ధం చెయ్యాలని కమిటీ సభ్యులకు సూచించారు. నర్సీపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో భూమిని సేకరించి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్విమ్మింగ్ ఫూల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని గూర్తించిన 15 మండల కేంద్రాల్లో 20 సెంట్లు చొప్పున భూమిని సేకరించడం జరిగిందన్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి వాలీబాల్ కోర్టులు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని జెడ్పీ సీఈవో నారాయణమూర్తిని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మాటాడుతూ పికెల్ బాల్ కోర్టు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించామని ఏపి విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ప్రసాద్‌కు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, జిల్లా క్రీడాలు అభివృద్ధి అధికారి ఎల్.వెంకట రమణ, జెడ్పి డిప్యూటీ సీఈవో రాజకుమార్, డీపీవో సందీప్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజుల వాణి, డ్వామా పీడీ పూర్ణిమా దేవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.