
అన్నదాతలకు ఎరువు కష్టాలు!
అరకొరగా యూరియా పంపిణీ
పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి పడిగాపులు
గతంలో ఈ పరిస్థితి లేదు..
గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ పాలనలో యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రాలేదు. అప్పట్లో పీఏసీఎస్‌కు సరిపడా యూరియా వచ్చేది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా యూరియాను ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సరిపడా యూరియాను ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం, అధికారులు లేనట్టుగా ఉంది. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది వేచి ఉన్నా దక్కని పరిస్థితి నెలకొంది. రైతులకు అవసరమయిన యూరియాను వెంటనే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
–త్రిశూలం ఈశ్వరరావు, రైతు, చౌడువాడ
మునగపాక/కె.కోటపాడు :
వివిధ రకాల పంటల సాగుకు అనువుగా ఎరువులను రప్పించాల్సి ఉన్నా పాలకులు గాని,అధికారులు గాని పట్టించుకోలేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రధానంగా యూరియా కోసం రైతులు నానా హైరానా పడుతున్నారు. సోమవారం మునగపాక పీఏసీఎస్ కార్యాలయం వద్ద అరకొరగా యూరియా అందించడంతో రైతులు క్యూ కట్టారు. ఎండలో గంటల తరబడి నిలబడి యూరియాను తీసుకువెళ్లారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసం అవస్థలు పడుతున్నామంటూ రైతులు వాపోయారు. రెండు రోజుల క్రితం 12 టన్నుల మాత్రం యూరియా రప్పించడంతో వాటి కోసం రైతులు పీఏసీఎస్ కార్యాలయానికి పరుగులు తీయాల్సి వచ్చింది.
కె.కోటపాడు మండలం చౌడువాడ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు ఉదయం ఆరు గంటల నుంచే పడిగాపులు కాశారు. పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందన్న సమాచారంతో ఆ పరిధిలో గల గ్రామాలైన చౌడువాడ, గుల్లేపల్లి, రొంగలినాయుడుపాలెం, పైడంపేట, పాచిలవానిపాలెం నుంచి వందలాదిగా రైతులు పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. వరి సాగుకు అనువైన కాలంలో యూరియాను వేయడం మంచిదన్న కారణంగా ఉదయం ఆరు గంటలకే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. పాస్ పుస్తకాలతో పాటు జెరాక్స్ పత్రాలను క్యూలైన్‌లో ఉంచారు. పీఏసీఎస్‌కు ప్రస్తుతం 12 టన్నుల యూరియా మాత్రమే రావడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులకు ఎలా పంపిణీ చేయాలో అని సిబ్బంది తలలు పట్టుకున్నారు. యూరియా ఎప్పడు ఇస్తారో అని ఎదురు చూసిన రైతులకు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి మధ్యాహ్నం 2 గంటల తరువాత పంపిణీ చేపట్టారు. ఒక్క బస్తా యూరియా అయినా దక్కుతుందని ఎదురు చూసినా పలువురు రైతులకు ఎరువులు అందక నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటి వరకూ వచ్చిన 36 టన్నుల యూరియాను పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేశామని, సీఈవో బత్తిన సత్యనారాయణమూర్తి తెలిపారు.
రైతులకు ఖరీఫ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించక, మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లేక అప్పులతో పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొరత రైతులను అవస్థల పాలు చేస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను అందించేవారు. ఈ ప్రక్రియతో రైతులకు ఇబ్బందులు తప్పేవి. సకాలంలో ఎరువులు అందించడంతో పంటల సాగుపై ఆసక్తి చూపేవారు. కూటమి ప్రభుత్వ వచ్చాక రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో పాటు పెట్టుబడి సాయం, ఎరువులు, విత్తనాలు సైతం రైతులకు సకాలంలో అందించడంలో విఫలం కావడంతో రైతులు సాగుకు అష్టకష్టాలు పడుతున్నారు.

అన్నదాతలకు ఎరువు కష్టాలు!

అన్నదాతలకు ఎరువు కష్టాలు!