
రెవెన్యూ కష్టాలు ఇన్నన్ని కావయా..
తుమ్మపాల: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)తో తమ సమస్యలు తీరడం లేదని, తమ గోడు పట్టించుకోవడం లేదని అర్జీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై వినతులు ఇచ్చినా పరిష్కారం లభించకపోవడంతో పదేపదే కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోందన్నారు. తమను పలువురు సిబ్బంది చులనకగా చూస్తున్నారని, తమ బాధ చెప్పుకున్నందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో దాదాపు 80 శాతం అర్జీలు రెవెన్యూ భూ సంబంధితమైనవే అయినప్పటికీ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. విచారణ నిమిత్తం వచ్చే అధికారులు అర్జీదారులతో మాట్లాడుతూ తీసుకున్న ఫొటోలను అప్‌లోడ్ చేసి సమస్య పరిష్కరించినట్టు జవాబు ఇవ్వడంతో అవాక్కవుతున్నామని చెప్పారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఈవారం మొత్తం 344 అర్జీలు నమోదు కాగా వాటిలో 188 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి.
నా భూమిని కొడుకులు లాగేసుకున్నారు..
భూ పంపకాల్లో తనకు కేటాయించిన రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో తొలగించి తప్పుడు సంతకాలతో కొడుకులు వారి పేరున ఆన్‌లైన్ చేసుకుని వృద్ధాప్యంలో ఉన్న తనను ఒంటరిగా వదిలేశారని నాతవరం మండలం పి.కె.గూడెం గ్రామానికి చెందిన లోగుడు నారాయణమ్మ ఫిర్యాదు చేశారు. తన భర్త ద్వారా వచ్చిన భూమిని ఇద్దరు కుమారులకు 6 ఎకరాల చొప్పున పంపకాలు చేసి మిగిలిన రెండెకరాలు తన వద్ద ఉంచుకున్నానని, తన తదనంతరం కుమార్తెలకు చెందాలని రాశానన్నారు. ఇది ఇష్టం లేని కుమారులు తాను బతికుండగానే తమ పేరిట మార్చేసుకున్నారని చెప్పారు. భూమిని తన పేరున ఆన్‌లైన్ చేసి న్యాయం చేయాలని కోరారు. రెండు నెలల క్రితం అర్జీ చేసినప్పటికీ స్పందన లేదన్నారు.