
కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య అక్కడక్కడా విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతుండడం తెలిసిందే. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసేన నేతల నుంచి వార్నింగ్ రావడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
సాక్షి, అనకాపల్లి: కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య ఏపీలో పలు నియోజకవర్గాల్లో విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసైనికులు వార్నింగ్ ఇచ్చారు.
పాయకరావుపేటలో అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ చిచ్చు రాజుకుంది. హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలో జనసేన ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఫోటో లేకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అనితకు టార్గెట్ చేస్తూ నిన్నటి నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు.
‘‘అనితమ్మా.. ఈరోజుతో అయిపోయిందనుకుంటే అది మీ భ్రమ. ఇది అలా అయిపోయేది కాదు. ముందు ముందు చాలా ఎన్నికలు ఉన్నాయి’’ అంటూ వార్నింగ్ పోస్టులు చేస్తున్నారు. అదే సమయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కొందరు నేతలు బహిరంగంగానే అనితకు సూచిస్తున్నారు. పాయకరావుపేట సీటును అనితకు గెడ్డం బుజ్జి త్యాగం చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
కూటమి అధికారం చేపట్టాక చాలా చోట్ల టీడీపీ వాళ్ల ఆధిపత్యమే కొనసాగడాన్ని జనసైనికులు భరించలేకపోతున్నారు. ఒక్క పాయకరావుపేటలోనే కాదు.. చాలాచోట్ల టీడీపీ జనసేనల మధ్య ఇలాంటి వైరమే కొనసాగుతోంది.