
వైద్యకళాశాలకు ప్రాణం పోయండి
మాకవరపాలెం: వైద్య కళాశాల నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పునః ప్రారంభించాలని ఉత్తరాంధ్ర ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద గత ప్రభుత్వం 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కళాశాల భవనాల నిర్మాణం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఇక్కడ నిర్మించే వైద్య కళాశాల ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం వారంతా విశాఖ కేజీహెచ్‌కు వ్యయ, ప్రయాసలకోర్చి వెళ్లాల్సివస్తోందన్నారు. ఈ కళాశాల భవనాలు అసంపూర్తిగా ఉండటం వలన ఇప్పటికే వెచ్చించిన నిధులు వృథా అవుతాయన్నారు. ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా ప్రధాన పాత్ర పోషించేది విద్య, వైద్యం అన్నారు. రాష్ట్రం, దేశంలో ఉన్నత విద్య, వైద్య విద్య సౌకర్యాలు లేక డాక్టర్ చదువులకు ఇతర దేశాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. భీమబోయినపాలెం వద్ద కళాశాల భవన నిర్మాణాలు ఆపివేసి, సామగ్రిని అమరావతి తరలించారన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తలపెట్టిన కళాశాలలను అర్థంతరంగా నిలిపివేయడం సరికాదన్నారు. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఒక్క ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల లేదన్నారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి, వివిధ విభాగాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పాల్గొన్నారు.