
గంజాయి కార్యకలాపాలపై గట్టి నిఘా
కశింకోట: విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి సమూల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. కశింకోట పోలీసు స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరును, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి సాగు చేసేవారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ప్రోత్సాహకాలు కల్పించి జీవనోపాధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఒడిశా నుంచి మన రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా కాకుండా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పోలీసు నిఘా పెంచామన్నారు. రేంజ్ పరిధిలో సుమారు 1700 మంది అనుమానితులను బైండోవర్ చేశామన్నారు. గంజాయి సేవించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తున్నామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ ఎం.శ్రావణిలను ఆదేశించారు. కశింకోట, తాళ్లపాలెం కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి సిగ్నల్స్ ఏర్పాటు గాని, ప్రత్యామ్నాయ చర్యలు గాని చేపట్టడానికి సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని ఎస్పీని ఆదేశించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కలిగించాలని చెప్పారు. సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.