
రూ.25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని వినతి
నక్కపల్లి:
మండలంలో బల్క్‌డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం నివాస ప్రాంతాలను త్యాగం చేసిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని డీఎల్‌పురం సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు కోరారు. ఈ మేరకు సోమవారం నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణకు వినతి పత్రం ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం నిర్వాసితులు ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రూ.8.90 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని, ఇది ఏ మాత్రం చాలదన్నారు. నిర్వాసితులకు పెద బోదిగల్లం వద్ద పునరావాస కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారని, అక్కడ ఇల్లు నిర్మాణానికి ప్యాకేజీ ఏమాత్రం సరిపోదన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో యజమానితోపాటు 18 ఏళ్లు వయసు నిండిన వారికి వివాహమైన ఆడపిల్లలకు ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇవ్వాలని, స్థానికంగా ఏర్పాటు చేసే కంపెనీల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. చందనాడ, తమ్మలపేట అమలాపురం మూపర గ్రామాల్లో కొంతమంది ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని, ఈ సమస్యా పరిష్కరించాలని కోరారు. సీపీఎం మండల కన్వీనర్ ఎం రాజేష్ పాల్గొన్నారు.