ప్రమోషన్‌ సున్నా | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్‌ సున్నా

Aug 20 2025 5:35 AM | Updated on Aug 20 2025 5:35 AM

ప్రమో

ప్రమోషన్‌ సున్నా

ఆరేళ్ల సీనియారిటీ ఉన్న సివిల్‌ కానిస్టేబుళ్లకు ప్రమోషన్‌ అర్హత

ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నుంచి 20 ఏళ్ల సర్వీసున్న కానిస్టేబుళ్లు 150 మంది

ఐదు నెలల క్రితం వారికి హెచ్‌సీ శిక్షణ కూడా ఇచ్చిన పోలీస్‌ శాఖ

సాంకేతిక అంశాలపై రిట్‌ పిటిషన్‌ వేసిన ఇతర విభాగాల వారు

కోర్టు కేసు ఉందని పదోన్నతుల ప్రక్రియ నిలిపివేసిన ప్రభుత్వం

మూడింతల సర్వీస్‌ ఉన్నా..
అనకాపల్లి జిల్లాలో బి.వెంకట్రావ్‌ (పేరు మార్పు) అనే కానిస్టేబుల్‌ 2009లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. దాదాపుగా 16 ఏళ్ల పాటు వివిధ పోలీస్‌స్టేషన్లలో సివిల్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. కానీ హెడ్‌ కానిస్టేబుల్‌గా (హెచ్‌సీ) పదోన్నతి రాలేదు. ఇటీవల పదోన్నతి శిక్షణ కూడా పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకుని ఐదు నెలలుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టులో కేసు ఉందని పదోన్నతుల ప్రక్రియ నిలిపివేశారు. కొందరి కోసం అందరి ప్రమోషన్లు ఆపడం తగదని వాపోతున్నారు.

సాక్షి, అనకాపల్లి:

ప్రజలకు రక్షణగా ఉండే పోలీస్‌ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న సివిల్‌ కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సివిల్‌ కానిస్టేబుల్‌గా ఆరేళ్ల సర్వీసు పూర్తయ్యాక సాధారణంగా పదోన్నతి ఇస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. ఇటీవల సీనియర్‌ కానిస్టేబుళ్లకు మూడు వారాలపాటు పదోన్నతి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ పూర్తయి ఐదు నెలలు గడిచినా వారికి పదోన్నతులు రాలేదు. రాష్ట్రంలో ఇలాంటి బాధితులు 869 మంది ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 150 మంది సీనియర్‌ కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రీ ప్రమోషన్‌ ట్రైనింగ్‌..

రాష్ట్రవ్యాప్తంగా 869మంది సీనియర్‌ కానిస్టేబుళ్లను గుర్తించి ఈ ఏడాది మార్చి 7వ తేదీ నుంచి 27 వరకు ట్రైనింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు. హెడ్‌ కానిస్టేబుల్‌ విధి విధానాలు, బాధ్యతల గురించి వారికి తగిన తర్ఫీదు ఇచ్చారు. ఈ ట్రైనింగ్‌ జరుగుతుండగా ఏపీఎస్‌సీ నుంచి ఏఆర్‌, ఏఆర్‌ నుంచి సివిల్‌కు కన్వర్షన్‌ అయిన కొంతమంది కానిస్టేబుళ్లు ఈ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్ట్‌లో రిట్‌ పిటిషన్‌ వెయ్యడంతో ఈ ప్రక్రియను మధ్యలో నిలిపివేశారు. ప్రతి జిల్లాలో 30 నుంచి 40 వరకు హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చి ఈ పోస్టులు భర్తీ చేస్తారని, తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు నిరాశ ఎదురైంది. ఇలాంటి సీనియర్‌ సివిల్‌ కానిస్టేబుళ్లు అనకాపల్లి జిల్లాలో 60 మంది, విశాఖ జిల్లాలో 65 మంది, అల్లూరి జిల్లాలో 25 మంది ఉన్నారు. కోర్టు కేసు ఉందని ప్రభుత్వం తమ ప్రమోషన్ల ప్రక్రియను పక్కన పెట్టడం తగదని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ప్రమోషన్‌ కోసం ఎదురుచూస్తున్న బాధిత కానిస్టేబుళ్లు కోరుతున్నారు.

ప్రమోషన్‌ సున్నా1
1/1

ప్రమోషన్‌ సున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement