
దుర్గంధభరితంగా ఎన్టీఆర్ ఆస్పత్రి
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిని కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో వివిధ విభాగాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డులు, ఆస్పత్రిలో పలు విభాగాల్లో చెత్తాచెదారం పేరుకుని, అపరిశుభ్రంగా ఉండడంతో మండిపడ్డారు. రెండో అంతస్తులో వరండాలో వర్షపునీరు ఎక్కువగా ఉందని, తక్షణమే తొలగించాలని, రోగులు వర్షపు నీటిలో జారిపడే అవకాశాలు ఉన్నాయని ఆదేశించారు. ఆస్పత్రి అవరణలో బైక్‌లు అడ్డదిడ్డంగా పార్కు చేశారని, ఆస్పత్రి పరిసరాలు దుర్గంధంతో నిండి ఉన్నాయని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ఆస్పత్రిలో కొన్ని విభాగాల్లో చీకటిగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంటే లైట్లు ఎందుకు వేయడం లేదని, మరోసారి ఇలా కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డి–అడిక్షన్(మాదక ద్రవ్యాల విభాగం) సెంటర్‌లో వైద్యులు ఎవరో, అటెండర్ ఎవరో, రోగి, సిబ్బంది ఎవరో అర్థం కాకుండా ఉందని, రోగుల బెడ్ వద్ద గుంపులు గుంపులుగా జనం ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన టీ క్యాంటీన్ వద్ద కూడా అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య, సెక్యూరిటీ కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలించారు. ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు పాల్గొన్నారు.

దుర్గంధభరితంగా ఎన్టీఆర్ ఆస్పత్రి