
అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం
అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా 10వ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి చంద్రావతి
జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
సబ్బవరం: అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమని సిటు రాష్ట్ర కార్యదర్శి చంద్రావతి హెచ్చరించారు. స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సిటు) 10వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్లు గ్రామాల్లో మాతా శిశు మరణాలను తగ్గించి పిల్లలకు కౌమార విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె చేయగా, వేతనాల పెంపు, గ్రాట్యుటీ చట్టాల అమలు హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు సమ్మె శిబిరాలకు వచ్చి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కనీసం పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. అంగన్‌వాడీల కనీస విధులతోపాటు, అదనపు బాధ్యతలు, యాప్‌ల పేరిట వేధించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అంగన్‌వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిటు రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా కోశాధికారి వీవీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఈ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలిగా జి.కుమారి, అధ్యక్షురాలిగా ఎం.దుర్గారాణి, ప్రధాన కార్యదర్శిగా నాగశేషు, కోశాధికారిగా వీవీ రమణమ్మ ఎన్నికయ్యారు. పాలకవర్గ సభ్యులుగా ఎన్.వరలక్ష్మి, కె.రామలక్ష్మి, పి.భవాని, ఆర్.మహాలక్ష్మి, తనూజ, ఎం.రమణి, చిన్నమ్మలు, సత్యవేణి, మంగ, టి.సంతోషి, అంజలి, సీహెచ్ రామలక్ష్మితో పాటు మరో 11 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం