
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సబ్బవరం: మండలంలోని చిన్నయ్యపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం హైవేను ఆనుకుని బోర్రమ్మగెడ్డ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. ముళ్ల పొదల్లో పడివున్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి సబ్బవరం పరిధి కావడంతో సబ్బవరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జి.రామచంద్రరావు, ఎస్‌ఐ దివ్య, సిబ్బందితో కలిసి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తుప్పల్లో పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించి వెలికి తీయించారు. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సుమారు 40–45 ఏళ్ల వయసున్న మృతుడి శరీరంపై నిక్కరు, బనియన్, చేతికి రాగి కడియం ఉంది. మరణించి నాలుగైదు రోజులై ఉంటుందని సీఐ తెలిపారు. ఒక బిచ్చగాడు వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలో సంచరించేవాడని, ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మృతుడు ఆ బిచ్చగాడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు.