
రంగస్థల కళాకారుడికి సన్మానం
మునగపాక: గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా ఆహ్వాన నాటిక పోటీల్లో రెండో రోజైన శుక్రవారం రంగస్థల నటుడు, దర్శకుడు ముసిలినాయుడును ఘనంగా సన్మానించారు. మునగపాక నందీశ్వర కళా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. కళారంగానికి ముసిలినాయుడు అందించిన సేవలను కొనియాడారు. అంతకముందు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ.. మునగపాకలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమయ్యే నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.