
పెద్దేరుకు వరద పోటు
మాడుగుల: మండలంలో అధికంగా జలవనరులున్న పెద్దేరు జలాశయం కేచ్‌మెంట్ ఏరియాలో గత రెండు రోజులుగా అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి శుక్రవారం ఉదయం నుంచి వరద నీరు పోటెత్తుతోంది. 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అప్రమత్తమైన జలాశయం అధికారులు 600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136. 45 మీటర్లకు చేరుకుంది.
అప్రమత్తంగా ఉండాలి
పెద్దేరు ఏటిబాధిత గ్రామాలైన డి. గొటివాడ, సత్యవరం, జేడీపేట, వీరవల్లి, జంపెన, గొటివాడ అగ్రహారం, ఓడపాడు గ్రామాలకు చెందిన రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. పెద్దేరు జలాశయానికి వరద ఎక్కువగా వచ్చి చేరుతోందని చెప్పారు. దీంతో జలాశయం నుంచి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారని తెలిపారు. రాత్రి పూట రైతులతో పాటు పశువుల కాపరులు పెద్దేరు నదిలో దిగరాదన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలకు చెందిన వీఆర్వోలకు సమాచారం అందజేసినట్టు చెప్పారు.