
ఎస్‌ఐను పావుగా వాడుకుంటూ...!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
అవినీతి కథలో అసలు దొంగలు తప్పించుకున్నారా? మొత్తంగా వసూలు చేసిన రెండు లక్షల్లో పట్టుకుంది రూ.50 వేలేనా..? మిగిలిన రూ.లక్షన్నర అప్పటికే వేరే వాళ్ల జేబులోకి వెళ్లిపోయిందా? అయితే ఎవరి జేబులోకి వెళ్లిందనే కోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలివిగా ఎస్‌ఐను ఇరికించి తప్పించుకున్న అసలు దోషిని తేల్చే పనిలో ఏసీబీ అధికారులు పడినట్టు సమాచారం. వాస్తవానికి అనకాపల్లిలో ఒక కేసు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్‌ఐ దాసరి ఈశ్వరరావును ఈ నెల 14వ తేదీన ఎస్‌ఐను ఏసీబీ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో అసలు దోషి మాత్రం తెలివిగా దొరకకుండా తప్పించుకున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా సదరు బాధితుడి నుంచి రూ. 2 లక్షల మేర వసూలు చేసినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అంతకు ముందు నేరుగా స్టేషన్‌లోనే రూ.లక్షన్నర తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రూ.లక్షన్నర ఎవరు తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు అనే కోణంలో లోతుగా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం.
‘విజయ’వంతంగా చక్రం తిప్పిందెవరు...?
వాస్తవానికి గత ఏడేనిమిదేళ్లుగా అనకాపల్లి ప్రాంతంలోనే ఎస్‌ఐ ఈశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నారు. కశింకోట, అనకాపల్లి రూరల్, సీసీఎస్ తదితర పోస్టింగులు నిర్వర్తించారు. గత ఏడాది కాలంగా అనకాపల్లి టౌన్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయనపై గతంలో ఎన్నడూ ఈ తరహా భారీ అవినీతి ఆరోపణలు లేవనే పేరు డిపార్టుమెంటులో ఉంది. ప్రధానంగా టౌన్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఈ వసూళ్ల ఆరోపణలు మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని వ్యవహారాల్లోనూ సదరు ఎస్‌ఐ ఈశ్వరరావును ముందుపెట్టి వసూళ్లకు దింపి.. ‘విజయ’వంతంగా వ్యవహారం నడిపింది ఎవరనేది తేలాల్సి ఉంది. ఏసీబీ అధికారులు కూడా ఈ కోణంలో ఇప్పటికే విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇవేకాకుండా పలు వ్యవహారాల్లో కూడా ఎస్‌ఐ ద్వారా నడిపించిన వసూళ్ల కథలో అసలు సూత్రధారి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రూ.50 వేలు తీసుకుంటూ దొరికిన ఎస్‌ఐ నుంచి ఈ సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్టు కూడా ప్రచారం గుప్పుమంటోంది. అంతేకాకుండా సదరు బాధితుడు కూడా గతంలో తాను రూ.లక్షన్నర ముట్టచెప్పినట్టు కూడా ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం అందించారని కూడా పోలీసుశాఖలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో విచారణ జరిపి అసలు దోషిని పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ముందుకెళ్లకుండా అడ్డుతగులుతున్నారని కూడా పోలీసుశాఖలో వార్తలు గుప్పుమంటున్నాయి.
వాస్తవానికి సదరు స్టేషన్‌లో అసలు వ్యవహారాలు నడిపిస్తున్న వ్యక్తి కాస్తా ఎస్‌ఐను పావుగా వాడుకుంటున్నట్టు సమాచారం. ప్రిన్సిపల్ ఎస్‌ఐవి నువ్వేనంటూ వసూళ్లకు దింపినట్టు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో పనిచేసిన సమయంలో ఒక భూమి వ్యవహారంలో తలదూర్చడంతో ఫిర్యాదులు ఎదుర్కొన్న సదరు వ్యక్తినే ఈ లంచాల అవతారంలో కూడా కీలక సూత్రధారిగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా స్థానికంగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూడా నెలవారీగా భారీగానే వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. గతంలో పలు ఆరోపణలతో పోస్టింగుకు దూరంగా ఉన్న సదరు వ్యక్తి.. ప్రస్తుతం రెచ్చిపోతున్నట్టు సమాచారం. అందినకాడికి ప్రతీ ఒక్క వ్యవహారంలోనూ మాముళ్లకు తెగబడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అత్యంత తెలివిగా నేరుగా రంగంలోకి దిగకుండా ఎవరినో ఒకరిని ముందుకుపెట్టి కథ నడిపిస్తూ.. విజయవంతంగా ముందుకెళుతున్నారనే పేరు ఉంది. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తులు ఇప్పటికే అడ్డుతగులుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకెళతారో? చూడాల్సి ఉంది.