
పునఃప్రారంభం
కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సలు
డాబాగార్డెన్స్(విశాఖ) : ఎట్టకేలకు పేదోడి గుండెకు భరోసా లభించింది. ఉత్తరాంధ్రలోనే పెద్దాస్పత్రిగా పేరుపొందిన కేజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలు పునః ప్రారంభమయ్యాయి. ‘సాక్షి’ వరుస కథనాలతో కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కార్డియో విభాగంలో పరికరాలు మూలకు చేరి ఏడు నెలలుగా గుండె సంబంధిత సర్జరీలు నిలిచిపోయాయి. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ వినూత్న నిరసనలతో కేజీహెచ్‌లో దుర్భర పరిస్థితులపై ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఏడు నెలల తర్వాత కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో తొలి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
కేజీహెచ్‌పై కూటమి నిర్లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్య భద్రతకు నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద వాడి వైద్యాన్ని గాలికి వదిలేసింది. ఒకవైపు మందుల కొరత వెంటాడుతోంది. గతంలో నెల రోజులకు సరిపడా మందులు ఒకేసారి అందించారు. కానీ ఇపుడు వారం, పది రోజులకు మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు ఆస్పత్రుల్లో కీలకమైన పరికరాలు నిర్వహణ లేక మూలకు చేరాయి. వీటి మరమ్మతులకు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో పీహెచ్‌సీల్లోనే కాకుండా పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో కూడా వైద్య సేవల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానంగా కీలకమైన కార్డియాలజీ విభాగంగా అధునాతన పరికరాలు మూలకు చేరాయి. వీటిని మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో గత ఏడు నెలలుగా గుండె సంబంధిత సర్జరీలు నిలిచిపోయాయి. ఫలితంగా పేద రోగు లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అక్కడ ఫీజులు చెల్లించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు.
సాక్షి వరుస కథనాలతో..
కేజీహెచ్‌లో ఏడు నెలలుగా గుండె శస్త్ర చికిత్సలు నిలిచిపోవడంతో ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు కూడా కేజీహెచ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కేజీహెచ్‌కు సాయం చేయాలని కోరుతూ బిక్షాటన చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ప్రభుత్వం కదలిక మొదలైంది.
ఏడు నెలల తర్వాత తొలి సర్జరీ..
ఏడు నెలల తర్వాత కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో చేపట్టిన సర్జరీ విజయవంతమైంది. శనివారం బోడపాటి మావుళ్లు (70)కు అధునాతన హార్ట్–లంగ్ మెషిన్, టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ సహాయంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ మనిత, డాక్టర్ సతీష్, స్టాఫ్ నర్స్ భవాని, ఇతర పారా మెడికల్ సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, సీఎస్‌ఆర్‌ఎంవో అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ అభినందించారు. ఇకపై ఈ అధునాతన మెషిన్ ద్వారా గుండె శస్త్ర చికిత్సలు నిరంతరాయంగా కొనసాగుతాయని సూపరింటెండెంట్ తెలిపారు.

పునఃప్రారంభం