బెదిరించి..రూ.25వేలు యూపీఐకి బదిలీ
యలమంచిలి రూరల్ : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువకుడిని బెదిరించి అతని మొబైల్ ఫోన్ యూపీఐ ద్వారా రూ.25 వేల నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై యలమంచిలి మండలం కొత్తలి గ్రామానికి చెందిన బాధితుడు ఇత్తంశెట్టి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పలు సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టగా 92 రోజుల తర్వాత ఇద్దరు నిందితులు యలమంచిలి మండలం పులపర్తి గ్రామానికి చెందిన తప్పెట్ల భగవాన్(25), ఎస్ రాయవరం మండలం వేమగిరికి చెందిన కొప్పన రవి(29)లను పట్టుకోగలిగామని ఆయన శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలివి. ఈ ఏడాది మార్చి 12న అచ్యుతాపురం టీజే పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బాధితుడు విధులు ముగించుకుని తన స్వగ్రామం యలమంచిలి మండలం కొత్తలికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పురుషోత్తపురం గ్రామానికి సమీపంలో హైవేపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు తనిఖీ సిబ్బందిలా వ్యవహరించి ద్విచక్రవాహనాన్ని ఆపి బాధితుడి వద్ద డబ్బు ఉంటే ఇచ్చేయమని బెదిరించారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో అతని మొబైల్ ఫోన్ లాక్కుని, యూపీఐ పిన్ చెప్పాలని అడగ్గా బాధితుడు చెప్పడానికి నిరాకరించాడు.అతడిపై చేయి చేసుకోవడం, చంపుతానని బెదిరించడంతో భయపడిన బాధితుడు ప్రసాద్ తన ఫోన్ పే యూపీఐ పిన్ నెంబరు నిందితులకు చెప్పాడు. దీనినుపయోగించి బాధితుడి బ్యాంకు అకౌంట్ నుంచి నిందితుల్లో ఒకరు తన మొబైల్‌లో ఉన్న బెట్టింగ్ యాప్ అకౌంటుకు రూ.15 వేలు, మరొకరు రెండు విడతల్లో మరో రూ.10 వేలు నగదు బదిలీ చేసుకున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్లకు కాకుండా బెట్టింగ్ యాప్‌కు నగదు బదిలీ చేసుకోవడంతో నిందితులను గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని సీఐ చెప్పారు. దారి దోపిడీకి పాల్పడడానికి ముందు రోజు రాత్రి నిందితులిద్దరూ మూడు చోట్ల మద్యం సేవించారని మార్చి 12వ తేదీ తెల్లవారుజామున మరొకసారి మద్యం సేవించడానికి డబ్బు లేకపోవడంతో నేరానికి పాల్పడినట్టు దర్యాప్తులో తెలిందన్నారు. నిందితులిద్దరూ అవివాహితులేనని మద్యం, బెట్టింగ్‌లకు అలవాటుపడి దారి దోపిడీకి తెగించారన్నారు. ఇలాంటి నేరాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. కఠిన శిక్షలు ఉంటాయన్నారు. నిందితులిద్దర్నీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చెప్పారు. సమావేశంలో యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర, ఆచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దారి దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్


