క్వారీ రోడ్డు కోసం కొండనే తొలిచేస్తున్నారు
తుమ్మపాల: అనధికార మైనింగ్ రహదారిపై బవులువాడ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ విజయకుమార్ రంగంలోకి దిగి పనులు నిలిపివేశారు. దీనిపై త్వరలో గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలో బవులువాడ రెవెన్యూ పరిధి రావుగోపాలరావు, జగనన్న కాలనీల వద్ద సర్వే నంబరు 70, 74, 75 కొండ మీదుగా నెల రోజులుగా చేపడుతున్న అనధికార మైనింగ్ రోడ్డును మంగళవారం ఆయన రూరల్ ఎస్సై రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. కొండపై మూడు కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు పరిశీలించి రావుగోపాలరావు కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీకి ఆనుకుని కొండపై రోడ్డు నిర్మించడం వల్ల కాలుష్యం పెరుగుదలతోపాటు బండరాళ్లు పడే అవకాశం ఉందని వాపోయారు. మార్టూరు రెవెన్యూ పరిధిలో నవీన్, రమణారెడ్డి క్వారీలకు తమ గ్రామం మీదుగా రాకపోకలు లేవని, కూటమి పార్టీ అండతో క్వారీ యాజమానులు దౌర్జన్యంగా కొండను తొలిచేస్తున్నారని ఫిర్యాదుదారులు కె.సత్తిబాబు, తదితరులు తెలిపారు. క్వారీ వాహనాల రాకపోకలకు గతంలో ఉన్న రోడ్డు వద్ద క్రమేణా నివాసాలు ఏర్పాటు కావడంతో ప్రత్యామ్నాయంగా కొండ మీదుగా రహదారి నిర్మాణానికి అంగీకారం తెలిపామని కొందరు కాలనీ వాసులు తెలిపారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తహసీల్దారు త్వరలో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. అనధికారిక రోడ్డు పనులుపై చర్యలు తీసుకోవాలని, జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఫిర్యాదుదారులు కోరగా, ప్రస్తుతానికి పనులు నిలిపివేయాలని, వాహనాలను తరలించాలని క్వారీ యాజమానులకు సూచించి వెనుతిరిగారు. ఆర్‌ఐ రమేష్, వీఆర్వో రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బవులువాడ గ్రామస్తుల ఫిర్యాదుతో
నిలిపివేసిన అధికారులు


