కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేదు | - | Sakshi
Sakshi News home page

కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేదు

Mar 12 2025 8:15 AM | Updated on Mar 12 2025 8:10 AM

● ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు ● భూములిచ్చిన రైతులను మోసం చేసిన ప్రభుత్వం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ● నిర్వాసిత గ్రామాల్లో పర్యటన

నక్కపల్లి: కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. విశాఖ చైన్నె ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆయన మండలంలోని ఇండస్ట్రియల్‌ కారిడార్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన నిర్వాసితులు, రైతులతో రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం, డీఎల్‌ పురం తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. డీఫారం భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి తోటలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు. జిరాయితీ రైతులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కోరితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరితే ఇచ్చినంత తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని హోం మంత్రి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. రైతుల నుంచి రెండు పంటలు పండే భూములను కారు చౌకగా తీసుకుని కార్పొరేట్‌ శక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు హాని కలిగించే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, జిల్లా కార్యవర్గసభ్యులు అప్పలరాజు, మండల కన్వీనర్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement