మా తాగునీరు సురక్షితం.! | - | Sakshi
Sakshi News home page

మా తాగునీరు సురక్షితం.!

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో 100 శాతం స్వచ్ఛమైన డ్రింకింగ్‌ వాటర్‌

195 రైల్వే స్టేషన్లు, 68 రైల్వే కాలనీల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహణ

1051 బ్యాక్టీరియలాజికల్‌, 12,790 క్లోరిన్‌ టెస్టులు నిర్వహించిన రైల్వే విభాగం

100 శాతం సురక్షితమని స్పష్టం చేసిన నివేదికలు

సాక్షి, విశాఖపట్నం: రైల్వే ప్రయాణికుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులతో పాటు, రైల్వే క్వార్టర్లలో నివసించే సిబ్బందికి వంద శాతం సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించేందుకు జోనల్‌ స్థాయి యంత్రాంగం విశేష కృషి చేస్తోంది. నిరంతర నాణ్యతా పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు తనిఖీల ద్వారా నీటిలో ఎలాంటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటూ దక్షిణ కోస్తా రైల్వే ఆదర్శంగా నిలుస్తోంది. రైల్వే స్టేషన్లలో తాగునీరు సురక్షితం కాదని, ఇందులో హానికారక బ్యాక్టీరియాలు ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు ఇటీవల హెచ్చరించాయి. దీనిపై స్పందించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాంగణాల్లో తాగునీటి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 195 రైల్వే స్టేషన్లలో ఈ డ్రైవ్‌ చేపట్టారు. నీరు కలుషితం కాకుండా ఉండేందుకు నిర్వహించిన 12,790 రెసిడ్యువల్‌ క్లోరిన్‌ నమూనా పరీక్షల్లో నీరు 100 శాతం సురక్షితమని తేలింది. అలాగే 1,051 బ్యాక్టీరియలాజికల్‌ పరీక్షలు నిర్వహించగా, అందులోనూ 100 శాతం విజయవంతమయ్యాయి. ఈ నీరు నేరుగా తాగేందుకు జీవశాస్త్రపరంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా సురక్షితమని నివేదికలు స్పష్టం చేశాయి.

రైల్వే కాలనీలు, ఆస్పత్రుల్లోనూ..

ప్రయాణికులకే కాకుండా రైల్వే ఉద్యోగుల సంక్షేమానికి కూడా అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రైల్వే కాలనీలు, ఆస్పత్రులు, హెల్త్‌ యూనిట్లు, శిక్షణా సంస్థలు, రైల్వే పాఠశాలలు, డీఆర్‌ఎం కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు, ఇతర విభాగాల కార్యాలయాల్లోనూ నీటి నాణ్యతను పరీక్షించారు.జోన్‌ పరిధిలోని వివిధ జిల్లాల్లో ఉన్న 68 రైల్వే కాలనీల్లో నిర్వహించిన క్లోరిన్‌ పరీక్షలు, 29 కాలనీలు, వైద్య విభాగాల్లో చేపట్టిన బ్యాక్టీరియలాజికల్‌ పరీక్షల్లో నూటికి నూరు శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో సిబ్బందికి సైతం స్వచ్ఛమైన నీరు అందుతున్నట్లు నిర్ధారణ అయింది.ఈ కార్యక్రమాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ స్వయంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా స్టేషన్లలోని ప్రయాణికులతో, కాలనీల్లోని రైల్వే సిబ్బంది కుటుంబాలతో నేరుగా మాట్లాడి నీటి నాణ్యత, ఇతర సదుపాయాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. జోన్‌లోని వైద్య, ఆరోగ్య, పర్యావరణ, ఇంజినీరింగ్‌ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటిలో ఖనిజాల సమతుల్యత దెబ్బతినకుండా రసాయన పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

మిషన్‌ మోడ్‌లో దక్షిణకోస్తా రైల్వే జోన్‌

జోన్‌ పరిధిలో ప్రయాణి కులు కానీ.. ఉద్యోగులు కానీ.. ఎక్కడ నీరు తాగి నా సురక్షితమేనని మే ము భరోసా ఇస్తున్నాం. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు కంకణం కట్టుకున్నాం. అన్ని రైల్వే స్టేషన్లు, కాలనీలు, ఇతర కార్యాలయాల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ‘మిషన్‌ మోడ్‌’లో పనిచేసేందుకు సిద్ధమయ్యాం. – సందీప్‌ మాథుర్‌, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement