ఏయూ ఉన్నతాధికారులకు హైకోర్టు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఏయూ ఉన్నతాధికారులకు హైకోర్టు షాక్‌

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

విశాఖ విద్య: మధ్యంతర ఆదేశాలను అమలు చేయకపోవడం, కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏయూ వీసీ, ఇతర బాధ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె. రాంబాబులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న న్యాయమూర్తి జస్టిస్‌ న్యాయపతి విజయ్‌ సమక్షంలో వ్యక్తిగతంగా గానీ, లేదా తమ న్యాయవాది ద్వారా గానీ హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

కేసు వివరాలు ఇవీ..

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలోని కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో సెల్ఫ్‌ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం జాతీయ స్థాయి ప్రకటన ద్వారా సుమారు మూడేళ్ల క్రితం 11 మంది అడహాక్‌ ఫ్యాకల్టీ నియామకం జరిగింది. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అనుమతితోనే తమ నియామకాలు జరిగాయని అడహాక్‌ అధ్యాపకులు కోర్టుకు పేర్కొన్నారు.వీరు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ (16953/2026)ను పరిశీలించిన న్యాయస్థానం, వారి సేవలను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్సిటీ యంత్రాంగం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి తమను విధుల నుంచి తొలగించిందని బాధితులు తెలిపారు. అంతే కాకుండా తమ స్థానంలో ప్రత్యామ్నాయంగా కొందరిని నియమించారని ఆరోపిస్తూ బాధితులు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

కలెక్టర్‌, ఈసీ వివక్ష

తాజా కోర్టు ఆదేశాలపై ఇప్పటికే కలెక్టర్‌కు, ఏయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బాధిత అడహాక్‌ ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేసింది. క్యాంపస్‌లో తమతో సమాన హోదా ఉన్న ఇతర కాంట్రాక్ట్‌ బోధనా సిబ్బంది, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది పట్ల ఒకలా, తమ పట్ల మరోలా వ్యవహరిస్తూ తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ నెల 29న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్‌లను ఆదేశించింది.

కోర్టు ధిక్కరణపై వీసీ, రిజిస్ట్రార్‌కు నోటీసులు

రేపు వ్యక్తిగతంగాహాజరుకావాలని ఆదేశాలు.

మధ్యంతర ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంపై సీరియస్‌

వీసీ మెడకు తాత్కాలిక అధ్యాపకుల తొలగింపు వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement