నాతవరం: కృషి, పట్టుదల ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చునని నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపారు. నాతవరం పాత పోలీసు స్టేషన్ భవనంలో ఎస్‌ఐ వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆదివారం డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఏపీపీఎస్సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే వారికి కావాల్సిన అన్ని రకాలు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఆన్‌లైన్ శిక్షణకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల సౌకర్యం కల్పించడం శుభపరిణామన్నారు. మారుమూల ప్రాంతంలో నిరుపేదల నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి మెటీరియల్ తెప్పించామన్నారు. చెడు వ్యసనాలకు లోను కాకుండా కొందరైనా విజయం సాధిస్తే తమ ఆశయం నెరవేరుతుందన్నారు. నిరుద్యోగులకు, యువకులకు ఎస్‌ఐ తారకేశ్వరరావు ప్రోత్సాహం అభినందనీయమన్నారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద నిరుద్యోగులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రంథాలయాన్ని ప్రారంభించిన
డీఎస్పీ శ్రీనివాసరావు


