● అడవితల్లిబాట బీటలు వారుతోంది
● మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
చింతపల్లి: మన్యంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సంబంధిత అధికారుల, కాంట్రాక్టర్లు ప్రజాభద్రతా ప్రమాణాలను పూర్తి విస్మరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆరోపించారు. ఆయన ఆదివారం చింతపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పారదర్శకత లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా కొయ్యూరు నుంచి పాడేరు మార్గంలో చింతాలమ్మ, రంపులు, ఘాట్‌రోడ్డులో తరచూ కొండచరియలు విరిగిపడడంతో ప్రయాణాలు సాగించే వారు ఎంతో ఇబ్బందులుపడాల్సి వస్తుందన్నారు. పాడేరు జిల్లా కేంద్రం నుంచి జి.మాడుగులు, చింతపల్లి వచ్చే రహదారిలో తాత్యాలిక వంతెనలు భారీ వర్షాలకు కొట్టుకు పోవడంతో గడిచిన నాలుగు రోజులైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తి నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇంతకంటే పెద్ద విపత్తులు వచ్చినప్పుడూ కూడా ముఖ్యమైన రహదారిలో రాకపోకలు నిలిచిపోవలేదని గుర్తు చేశారు. జిల్లా కేంద్రం నుంచి చింతపల్లి, సీలేరు, నర్పీపట్నం రాజమండ్రి ప్రాంతాలకు అవసరమైన జాతీయ రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అర్థమవుతుందన్నారు. జాతీయ రహదారి పేరుతో వందలాది ఎకరాలకు ఉపయోగపడే పెదవలస, మడిగుంట, తాజంగి, జి.మాడుగుల.కరకపుట్టు వంటి పురాతన చెరువులను కోల్పోవలసి వచ్చిందన్నారు.
ప్రచార ఆర్భాటమే..అభివృద్ధి జాడలేదు
కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్పితే అబివృద్ధి జాడలేదని బాలరాజు విమర్శించారు. మన్యంలో అడవి తల్లిబాట పేరిట చేసిన ఎక్కడ అభివృద్ధి జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కోట్లాది రూపాయలతో అడవితల్లి బాటలు ఎక్కడ, ఎంతమేర, ఎన్ని గ్రామాలకు నిర్మించారో తెలియజేయాలన్నారు. ఏ ఏ గ్రామాలకు ఈ రహదారుల వలన అంబులెన్స్, ఆటో, బస్సు వంటి రవాణా సౌకర్యం కలిగిందో చెప్పాలని ప్రశ్నించారు. విబిజీ రాంజీ పథకం పేరిట మైదాన ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లును దిగుమతి చేసుకుని కోట్లాది రూపాయలు చెల్లించడం తప్పితే ఎక్కడా బీటలు తప్పితే బాటలు కానరాలేదన్నారు. కూటమి ప్రచార ఖర్చుతో మన్యంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టవచ్చునన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ నాయకులు ప్రచార ఆర్బాటాలకు పోకుండా మన్యప్రాంత అభివృద్ధిని బాద్యత తీసుకుని వ్యవహరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, నాయకులు రీమలి మౌళి, సతీష్ తదితరలు పాల్గొన్నారు.


