‘ఐసుగెడ్డ’లో
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. శీతాకాలంతో పాటు ఇతర కాలాల్లో వివిధ అందాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇందులో భాగంగానే సీలేరులో ఇరుముడి సినిమా చిత్రీకరణ అనంతరం ఈ ప్రాంతం బాగా పేరొందింది. సీలేరు అందాలు పర్యాటకులకు గుర్తు చేశాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సీలేరు పరిసర ప్రాంత జలపాతాలు ళకళలాడుతున్నాయి. జలపాతాలు పాలనురగల నీటితో జాలు వారుతున్నాయి. సీలేరు సమీప అంతర్రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఐసుగెడ్డ జలపాతం పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది. ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ వందల అడుగుల నుంచి జాలువారుతున్న నీటి వద్ద పర్యాటకులు ఫోటోలు తీసుకొని సందడి చేస్తుంటారు. ఈ జలపాతం వద్ద ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. జలకాలాడుతూ జలపాతం వద్ద ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు సీలేరు అంతట మంచు కురుస్తూ ప్రకృతి అందాలు మరింత మైమరిపించాయి.


