అనకాపల్లి: పరవాడ మండలంలో పెద్ద చెరువులోకి ఫార్మా వ్యర్థాలు విడుదల చేసిన రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దచెరువులో మొల్లెడిగడ్డలో నుంచి సన్యాసి చెరువు మీదుగా ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలలను ఏ విధమైన శుద్ధి చేయకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన నోటీసులను స్వాగతించారని, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాలువలు, చెరువులు, గెడ్డల్లోకి వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు నాశనమవుతాయన్నారు. ఫార్మా వ్యర్థ జలాలను ఒక్కసారిగా కాలువలు, గెడ్డలు చెరువుల్లోకి విడుదల చేయడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురౌవుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.


