తుమ్మపాల : పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 364 అర్జీలు నమోదు కాగా వాటిలో 182 భూ సమస్యలు, 42 సర్వే విభాగం, 29 పంచాయతీరాజ్ శాఖల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల ధర్నా
ఆటో మోటార్ కార్మికులపై ఉరితాడు లాంటి జీవో నంబర్ 21,31ను రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు కలెక్టరేట్ వద్ద నిరసన చేసి కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఆటో అండ్ మోటార్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకురావడం వల్ల ఆటో, మోటార్ కార్మికులు 60 శాతం ఆదాయాన్ని కోల్పోయామన్నారు. డ్రైవర్ల సంక్షేమానికి కావలసిన నిధులు కేటాయింపు, 60 సంవత్సరాలు వయసు దాటిన డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని పలు డిమాండ్‌లు చేశారు. ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ, రాజాన దొరబాబు, పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్ బేగ్, చంద్ర రావు, బాలు, వై.రాజు, అప్పన్న దొర, పి.వెంకటేష్, లోవరాజు, శ్రీను పాల్గొన్నారు.
ప్రైవేటు క్రషర్లపై ఫిర్యాదు
సహజ వనరులైన వాగులు, గెడ్డలను మూసివేసి నీటి ప్రవాహం లేకుండా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ప్రైవేటు క్రషర్లను నియంత్రించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మార్టూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి మండలం మార్టూరు సర్వే నెం.6,7 వాగులను ఆక్రమించడంతో గ్రామంలో కామన్న చెరువుకు వచ్చే వర్షపు నీటిని అడ్డుకున్నారన్నారు. మార్టూరు, చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయం మొత్తం కామన్న చెరువుపైనే ఆధారపడి ఉందని, 100 ఎకరాలకు పైగా మెట్ట, మాగాణి భూములకు నీరందడం లేదన్నారు. మట్టి, బండరాళ్లు, క్రషర్ వ్యర్థాలను డంప్ చేయడం ద్వారా, భారీ వాహనాల కోసం ఒక అప్రోచ్ రోడ్డును నిర్మించడం ద్వారా గెడ్డ పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. అధికారుల ముందు వాస్తవాలను వక్రీకరించి, సరైన అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న క్రషర్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు సర్వే నెం.171లో మా భూములు కూడా రవితేజ క్రషర్ వెదజల్లె కాలుష్యంతో నాశనమైపోతున్నాయంటూ గ్రామానికి చెందిన కరణం నర్శింగరావు మరో ఫిర్యాదు చేశారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం వినతి
పరవాడలో ఈఎస్‌ఐ అసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఫార్మా, ఎన్‌టీపీసీ లాంటి పరిశ్రమలు చోట 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, అక్కడే ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం సర్వే నెం.259లో 1.43 ఎకరాల స్థలం కూడా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే దగ్గరలోని ఆసుపత్రి లేక విశాఖ తరలించే లోపున మరణాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు.


