చోడవరం : తమ కూతుర్ని అదనపు కట్నం కోసం వేధింపులతో ఆత్మహత్యకు పురిగొల్పిన అత్తింటి వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులంతా కలిసి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. వివరాలివి. చోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మొల్లి భవానీ (28), ఆమె భర్త గోవిందు, పిల్లలిద్దరితో కలిసి తమ సొంతవూరు కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామం నుంచి చోడవరం మండలం నర్సాపురం వచ్చి ఇటీవల ఇల్లు నిర్మించుకొని ఇక్కడే కాపురం ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో భవానీ ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఆమె భర్త స్థానికులు కలిసి హుటాహుటిన చోడవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న వెంటనే పెందుర్తిలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు నంబారు అప్పారావు, లక్ష్మితో బంధువులు, నర్సాపురం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి చోడవరం పోలీసు స్టేషన్‌కు వచ్చి ముట్టడించారు. కుటుంబ కలహాల కారణంగానే తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ భవానీ తమకు తెలిపిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తన అల్లుడే అదనపు కట్నంకోసం, అనుమానపు మాటలతో చిత్రహింసలకు గురిచేశాడని, వెంటనే భర్త గోవిందను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది ఒకేసారి పోలీసుస్టేషన్‌కు వచ్చి ముట్టడించడంతో పోలీసులకు మృతురాలు బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి మృతురాలి భర్తను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నామని సీఐ అప్పలరాజు చెప్పడంతో అంతా శాంతించి వెనుదిరిగారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అందజేశామని, ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.


