ఇష్టమైన బైక్‌ కోసం మానసిక రోగి ఆరాటం | - | Sakshi
Sakshi News home page

ఇష్టమైన బైక్‌ కోసం మానసిక రోగి ఆరాటం

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

● ఆస్పత్రి నుంచి పారిపోయి.. బైక్‌ చోరీకి యత్నం ● ఖాకీల చొరవతో తల్లిదండ్రుల సమక్షంలో ఆస్పత్రికి

విశాఖ విద్య: యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌ నడపాలన్నది అతని కల. అమ్మానాన్నలను అడిగితే కొనివ్వలేదని, పార్కింగ్‌లో కనిపించిన బైక్‌ను తీసుకెళ్లబోయాడు. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకుని గద్దించేసరికి ఆ యువకుడు చెప్పిన సమాధానాలు పోలీసులనే విస్తుపోయేలా చేశాయి. అది నేర ప్రవృత్తి కాదని, ఓ మానసిక రోగి అమాయక చేష్ట అని తెలియడంతో కఠినంగా వ్యవహరించాల్సిన చట్టం సైతం మానవతా దృక్పథాన్ని కనబరిచింది.

విశాఖ ఫోర్త్‌ టౌన్‌ క్రైమ్‌ ఎస్‌ఐ మొహిద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి దొండపర్తి బాటా షోరూం వద్ద పార్క్‌ చేసి ఉన్న యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌ను ఒక యువకుడు అపహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్‌ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు చోడవరం మండలం ఖండివరం గ్రామానికి చెందిన గెడ్డం సాయికుమార్‌(26)గా గుర్తించారు. బైక్‌ ఎందుకు దొంగిలిస్తున్నావని ప్రశ్నించగా.. ‘నాకు యమహా బైక్‌ అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రులను కొనివ్వమని అడిగినా కొనివ్వలేదు.. అందుకే తీసుకెళ్తున్నా’.. అంటూ అమాయకంగా బదులిచ్చాడు. తాము ఐదు రోజుల క్రితం విశాఖ వచ్చామని, అమ్మానాన్నలతో కలిసి ఆస్పత్రిలో ఉంటున్నట్లు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

అతడు చెబుతున్న ఆస్పత్రి వివరాలపై ఆరా తీసిన పోలీసులు.. అది చిన్నవాల్తేరులోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంగా గుర్తించారు. వెంటనే అక్కడి సిబ్బందిని సంప్రదించగా, ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి ఒక రోగి తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. సాయికుమార్‌ వైద్య రికార్డులను పరిశీలించి అతడి పరిస్థితిని నిర్ధారించుకున్నారు. నేరగాడిలా చూసి కేసు నమోదు చేయకుండా, అతని మానసిక స్థితిని అర్థం చేసుకున్న పోలీసులు.. సాయికుమార్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో యువకుడిని సురక్షితంగా ఆస్పత్రి వర్గాలకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement